Tuesday, February 14, 2012

సార్వత్రిక సమ్మెలో పాల్గొందాం

మిత్రులారా

ఈ నెల 28న దేశ వ్యాపితంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ పిలుపుని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏఐఎస్ జిఇఎఫ్, ఎస్ టిఎఫ్ఐ తదితర అఖిలభారత ఫెడరేషన్లు, సంఘాలు సమర్థించాయి. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని, హక్కులను హరిస్తున్న ప్రభుత్వ విధానాలను నిలువరించడానికి జరుగుతున్న ఈ సమ్మెలో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటియఫ్) విజ్ఇప్తి చేస్తున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా ధనవంతులు కుబేరులుగా, పేదలు మరింత పేదలుగా మారిపోతూ మధ్య తరగతి ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా దిగజారుతున్నది. ప్రభుత్వ నియంత్రణ లేకపోవటం వలన విచ్చలవిడిగా పెరుగుతున్న ధరలతో నిజవేతనాలు నీరసించిపోతున్నాయి. పెరిగిన ధరలకి తగినట్లుగా డిఏ పెరగటం లేదు. 2006 నుండి నేటి వరకు ధరలు 174 శాతం పెరిగాయి. కాని పెరిగిన డిఏ 57శాతం మాత్రమే. అందువలన ధరల పెరుగుదలను అరికడితేనే ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజలకు ఎంతో ఉపశమనం కల్గుతుంది. మన రాష్ట్రంలో 9వ పీఆర్ సీ ప్రకారం ఉద్యోగుల కనీస వేతనం నెలకి రూ. 6700 లు మాత్రమే. అప్రంటీస్ టీచర్లకు అదికూడా లేదు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ తో పని చేస్తున్న వారికి కనీస వేతనాలు కూడా లేవు. కంప్యూటర్ టీచర్లకు నెలకి రెండున్నరవేలు మాత్రమే చెల్లిస్తున్నారు. కనుక కనీస వేతనం నెలకి రూ 10వేలుగా నిర్ణయించాలనే డిమాండ్ నెరవేరితే ఆ దామాషాలో ఉపాధ్యాయుల జీతాలు పెరిగే అవకాశం లభిస్తుంది.
శాశ్వత ఉద్యోగాలలో రెగ్యులర్ నియామకాలు చేయకుండా ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకుకి సాగిలపడుతున్నాయి. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పేరుతో లక్షలాదిమంది ఉద్యోగులు అతి తక్కువ జీతాలతో వెట్టిచాకిరీ చేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేకుండా ఉసూరుమంటున్నారు. కంప్యూటర్ టీచర్స్, ఐఇడి టీచర్స్, కెజిబివి టీచర్స్, సిఆర్ టీలు గెస్ట్ టీచర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ తదితర లక్షమందిపైగా మన రాష్ట్రం విద్యాలయాల్లో పనిచేస్తూ అర్థాకలితో అలమటిస్తున్నారు. వీరికి పిఎఫ్, పెన్షన్ సదుపాయాలు కూడా లేవు. 2004 తరువాత అపాయింట్ అయిన ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పెన్షన్ లేకుండా పోయి, కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంలోకి నెట్ట బడ్డారు. పార్లమెంటులో పెండింగ్ లో వున్న పిఎఫ్ ఆర్ డిఏ బిల్లు ఆమోదం పొందితే 2004 ముందు సర్వీసులో చేరిన వారి ప్రభుత్వ పెన్షన్ కి కూడా ప్రమాదం దాపురిస్తుంది. కనీస వేతనాలు, ప్రభుత్వ పెన్షన్, భవిష్యనిధి వంటి సామాజిక రక్షణలు సాధించుకోలేకపోతే ఉద్యోగుల పరిస్థితి ప్రమాదంలో పడిపోతుంది. సమ్మె హక్కు లేదనే వంకతో ఉద్యమాలను అణిచివేసే దుర్మార్గపు చర్యలు పెరిగిపోతున్నాయి.
కాబట్టి ఉద్యోగుల సంక్షేమం కోసం, హక్కుల రక్షణ కోసం జరిగే సార్వత్రిక సమ్మెలో అందరూ పాల్గొనాలి. సమ్మె చేస్తే సమ్మె రోజుకి జీతం వస్తుందా లేదా అనే అనుమానంతో వెనకాడకుండా సమ్మెలో పాల్గొనాలి. ఈసారి అధికార, ప్రతిపక్షపార్టీలకు సంబంధించిన కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొంటున్నాయి అంటేనే సమ్మె ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. సమ్మెకి సన్నాహంగా జరిగే కార్యక్రమాలు, సమ్మెరోజు జరిగే ప్రదర్శనలు, సభలలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఇప్తి చేస్తున్నాము.
ముఖ్యమైన డిమాండ్లు.
1. ధరల పెరుగుదలను అదుపు చేయాలి.
2. నూతన పెన్షన్ స్కీం(పిఎఫ్ ఆర్ డిఏ బిల్)ని ఉపసంహరించాలి.
3. ఆదాయపు పన్ను మినహాయింపు (పొదుపు తగ్గింపులు రూ. 1.5 లక్షల తదుపరి) పరిమితి రూ 3 లక్షలకు పెంచాలి.
4. ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మెహక్కుని చట్టబద్ధం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ జిఓ 177 ను రద్దు చేయాలి.
5. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాలు విరమించాలి.
6. కనీస వేతనం రూ. 10వేలు గా నిర్ణయించాలి.
7. అందరికి గ్యారంటీతో కూడిన పెన్షన్ ఇవ్వాలి.
8. ప్రావిడెంట్ ఫండుపై వడ్డీ రేటుని పెంచాలి.
9. శాశ్వత ఉద్యోగాలలో రెగ్యులర్ నియామకాలే చేయాలి.
10. దీర్ఘకాలికంగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలి.

ఐకమత్యమే మహాబలం
కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఐక్యత వర్థిల్లాలి

No comments:

Post a Comment